తెలుగు నెరవు అంటే?
ఔచిత్యము, ఔన్నత్యము, పూర్ణత్వము, ప్రాచుర్యము, మార్గము వంటి వేర్వేరు సంస్కృత మాటలకి తెలుగు మాటే నెరవు. నెరవు అంటే నిండుతనం అని కూడా తెల్లముంది. “నిన్నే నెర నమ్మితి రా..” అని పాడిన చోట నెర నమ్మటం అంటే నిండుగా నమ్మడం అన్నది తెలుస్తున్నది కదా? ‘నెరవు’ ఒకప్పుడు బాగా వాడుకలో ఉన్న మాటే, ఇటీవల వాడకం తగ్గింది అంతే. ఇలాంటి వెన్నో తేట తెలుగు మాటలని మన రాతరులు, నడువాలు (Media) పక్కన పెట్టేస్తూ వేరే నుడుల మాటలను నెత్తిన మోస్తూ వస్తున్న వైనం గడచిన కొన్ని పదేడుల (Decades) నుండీ కొనసాగుతూ వస్తున్నది 1. రాతల్లోకి చేరలేకపోయిన ఇటువంటి వేవేల మాటలు ఇప్పటికీ పాటుపడే మంది నాలుకల మీద మెదులుతూనే ఉన్నాయి. అవే నిక్కమైన తెలుగు చరితను ఇప్పటికీ తమలో నింపుకొని ఉన్నవి. అందుకని వీలయినంత ఎక్కువగా మా రాతలలో మేము ఆ తొలిబతుకుల మాటలను వాడదలుచుకొన్నాము.
- ఇప్పుడు కొత్తగా తెలుగు నుడి లోతులను తేరిపారటం దేనికొరకు? ఎవరి కొరకు?
- నేలమీది ఏ నుడికైనా కొన్ని విడితలు (ప్రత్యేకతలు) ఉంటాయి కదా? మరి తెలుగుకు ఉన్న విడితలు ఏమిటి?
- కనుబడి నుడిగా (ఉత్పత్తి భాషగా), గుడి నుడిగా (మతం భాషగా), ఏలుబడి నుడిగా (పాలక భాషగా) బతుకులోని అన్ని కొనలను తెలియచెప్పే చేవను నింపుకొన్న నిండైన నుడిగా తెలుగు ఎలా ఎదిగినది? ఈ వరుసలో ఎంతగా మాటల విరివిని కూర్చుకొన్నది?
- కనుబడి మట్టులో (దశలో) చేతిపనుల వారి ఎరుకువను పొందుపరచుతూ పంచుతూ మెరుగించుతూ పాటులో ఒక కనుబడి-ముట్టుగా (సాధనంగా) తెలుగునుడి ఎలా పదునెక్కుతూ వచ్చింది?
- ఒక వడ్రంగి, కొయ్యతో తను చేసిన పని ముట్టును గురించి ఎదుటివారికి చెప్పవలసి వచ్చినపుడు ‘దీనిని ఏమని అనవచ్చు?’ అని తనను తాను అడుగుకొని, తన తలపులలో ‘ఇలా అంటే బాగుంటుంది’ అని అనుకొని, ఆ పనిముట్టు ఉరువుతీరును (physical attributes and purpose) బట్టి అనువైన పేర్లను పుట్టించిన తరి (కాలం) ఒకటి ఉండేది. ఆ తరికి నుడి అనేది మొత్తంగా కనుమడింపరుల (ఉత్పత్తిదారుల) చేతిలో ఒక చేముట్టుగా (tool గా) తోడుపడింది. అటువంటిది ఈనాడు మాటల కోసం మనం మనదైన కనుబడి తెలివిని విడిచిపెట్టి, నుడిగంటులలో (dictionary లలో) వెతుక్కొనే కరవు నిలవరంకు (పరిస్థితికి) చేరుకొన్నాము. ఇది ఎలా జరిగి ఉంటుంది? కనుబడిలో లెక్కకట్టలేనన్ని మాటలని పుట్టించిన తెలుగు బతుకు నడక సొంత మాటల పొందికకు (syntax కు) ఎలా ఎడమయింది? ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలనుకుంటే అది ఎక్కడ దొరుకుతుంది?
ఇలాంటి పలు ఊసులను తెలుగు నెరవు తడుముతుంది. ఈ పనిలో వంతుగా తెలుగుకు చెందిన కనుబరుపు కళలను, చేనేర్పు కళలను పొందుపరచి, ముందు తరాల ఎరుకువ కోసం దాచిపెట్టే పనిని తలకు ఎత్తుకొనింది. ఇప్పటికి ఇదొక తలపు మట్టుకే. ఈ మందల (సమాచారం) నాలుగు దిక్కులకూ పాకి, మంది నడకలు కూడా కలిసి తెలుగు గొప్పగా నిలబడుతుందని మా నమ్మకం.
- దీనికి కారణాలు ఏమిటన్నది మరల విడమరపుగా మాట్లాడుకొందాము. ↩︎
